Jagathguru Bhodalu Vol-9        Chapters        Last Page

బ్రంటన్‌ కథ
''విశాఖ''

పాల్‌బ్రంటను క్రీ. శ. 1898లో లండనులో జన్మించారు. విద్యాభ్యాసం ఇంగ్లండులోను అమెరికాలోనూ జరిగింది. తత్త్వశాస్త్రంలో ఆయన డాక్టరేటు పుచ్చుకొన్నారు. బహుగ్రంథకర్త. ఆయన పుస్తకాలు బహు భాషలలో అనువదింపబడినవి. 'గుప్త భారతంలో అన్వేషణ' (ఆ ా|శస-ఠ n ా|-స|ష ఒndశ) అనే పుస్తకం వారు వ్రాశారు. ఈపుస్తకం పందొమ్మిది ముద్రణలు చూచింది.

ఈ పుస్తకంలో తత్త్వాన్వేషణకోసం ఆయన ఎన్ని పాట్లు పడ్డారో వివరంగా వర్ణించారు. ఎంతోమంది యోగులను, మహాత్ములను దర్శించినారు. సత్యదర్శనం కోసం తహ తహలాడి గురువును అన్వేషిస్తూ ఆయన భారతదేశానికి వచ్చారు. కానీ ఆయనకళ్ళకు అధికముగా కనబడినవారు ఫకీరులూ, ఇంద్రజాలము చేసేమోసగాళ్ళూ, కొన్నిచోట్ల మహాత్ములదర్శనం చేసినా, వారు ఈయనమనస్సును పూర్తిగా ఆకట్టుకొనలేకపోయారు. ''నేను వట్టి చేతులతో భారతంనుండి తిరిగి వెళ్ళిపోవాలా? పాతకాలపు ఋషులు ఈ దేశంలో నామరూపాలు లేకుండా మాయమై పోయారా'' అన్న నిరుత్సాహం కూడ ఒకపుడు ఆయనకు కలిగింది.

మద్రాసులో మకాం చేస్తున్నపుడు, ఆయన వెంకటరమణి అనే ఒక రచయితను కలుసుకోవడం తటస్థించింది. వెంకటరమణిని పరిచయం చేస్తూ వ్రాసిన తన స్నేహితుని లేఖ ఆయన తెచ్చాడు. ఆయన పెట్టెలో ఎన్నో ఈలాంటి పరిచయ పత్రాలు ఉన్నాయి....... వానినేవీ ఆయన వాడదలుచుకో లేదు.

వెంకటరమణి మద్రాసు యూనివర్సీటీలో సెనేట్‌ మెంబరు ప్రతిభావంతుడైన రచయిత. ఆయన వ్రాసిన పుస్తకాలలో - గ్రామజీవనం ఇతివృత్తం. నిరాడంబరమైన జీవి. వెంకటరమణి పాల్‌ బ్రంటన్‌ను చూడటానికి వచ్చారు.

ఇద్దరూ ఇష్టాగోష్టి చేశారు. రాజకీయాలు చర్చించారు. తమ అభిమాన పాత్రులైన కవుల కావ్యాలను ఉగ్గడించారు. ఈ సంభాషణ మధ్యలో బ్రంటన్‌ తాను ఏ కార్యార్థం భారతదేశం వచ్చారో వెల్లడించారు. 'భారతదేశంలో నిజమైన యోగులున్నారా? వారిని తాను దర్శించగలడా? వారు తనకు తత్త్వాన్వేషణలో సాయపడగలరా?'

అందులకు వెంకటరమణి ఇలా అన్నాడు. 'ప్రస్తుతం ప్రజలధ్యాస ప్రాపంచిక సౌఖ్యాలపైననే ఉంది. తత్త్వాన్వేషణ చేసేవారు చాలతక్కువ. భారతదేశంలో మహనీయులు లేకపోలేదు. కాని వారిని వెదకి పట్టడం కష్టం. వాళ్ళెక్కడో, జనసంపర్కంలేని చోటులలో ఏకాంతంగా ఎవరికీ తెలియరాక కాలం గడుపుతూవుంటారు. వారిని కనుక్కోవటం మాబోటివారికే కష్టం. మీబోటి పాశ్చాత్యులకు దాదాపు దుర్లభ##మే. మీరు అదృష్టవంతులైతే గాని వారిని దర్శించలేరు. దానికీ యోగం ఉండాలి.''

మరుసటిరోజు వెంకటరమణి ఆకస్మికంగా పాల్‌ బ్రంటన్‌ వద్దకు వచ్చారు. క్రిందిరోజు సంభాషణ గుర్తుతెస్తూ 'మాగురువు చెంగల్పట్టులో విడిదిచేసినట్లు తెలిసింది. వారు శంకరాచార్య పరంపరకు చెందినవారు. దక్షిణభారతానికి వారు ఆధ్యాత్మికాచార్యులు. వేలకొలది జనులు వారిని భగవదంశగా గ్రహించి ఆరాధిస్తారు. వారి కటాక్షం నాయందున్నది. వారు ఋషితుల్యులు. ఆ మహానుభావుణ్ణి మీరు దర్శింపగలిగితే మీకు వారు యోగుల విషయంలో ఏదైనా త్రోవచూపకపోరు'' అని అన్నారు.

వెంకటరమణితో కలసి పాల్‌బ్రంటన్‌ స్వాములవారిని దర్శించ డానికి నిశ్చయించుకొన్నారు. ఇద్దరూ చెంగల్పట్టు వెళ్ళారు. త్రోవలో వెంకటరమణి కానుకోటిపీఠాధిపతులను గూర్చి ఎన్నో విషయాలు తెలియచేశారు. శ్రీవారి బంధుకోటిలో ఒకరికి కీళ్ళనొప్పులు. చాలకాలం బాధపడుతున్నారు. వ్యాధితో మంచానికి అంటిపెట్టుకొని ఉన్నారు. శ్రీవారు వారిని అనుగ్రహించి వారివద్దకు వెళ్ళి వారి శరీరాన్ని స్పృశించినంతమాత్రాన ఆయన వ్యాధి పూర్తిగా నిమ్మళించింది. శ్రీవారు తాకిన మూడు గంటల వ్వవధిలో ఆయన లేచికూర్చోటమే కాక ప్రక్కదిగి నడవసాగినాడు. పూర్ణంగా ఆరోగ్యం కోలుకొన్నాడు. అంతేకాదు. శ్రీవారికి ఎదిరివారి మనోభావాలను గ్రహించే శక్తీ ఉన్నది. అని వెంకటరమణి బ్రంటనుకు తెలియచెప్పాడు.

వెంకటరమణి, బ్రంటనూ చెంగల్పట్టు ప్రవేశించి స్వామి విడిదిచేసినచోటుకు వెళ్ళారు. జనసమ్మర్థం ఎక్కువగా ఉన్నది. రెండువందలకు పైగా జనం కాచుకొనిఉన్నారు. స్వామిదర్శనార్థం. వెంకటరమణి ఎలాగో కష్టపడి బ్రంటనుకు దర్శనసౌలభ్యం కల్పించారు. బ్రంటనుకై స్వామి తనకార్యక్రమాన్ని మార్చుకొని, ఒక గంటలో రావచ్చునని కబురుపంపారు.

చిన్న ద్వారంకల గదిలో స్వాములవారు కూర్చుని ఉన్నారు. వెనుకనున్న ద్వారంనుంచి వెలుగు వస్తున్నది. స్వాములవారిని సమీపించి బ్రంటన్‌ను తాను తెచ్చిన ఫలపుష్పాలను అర్పించి వందనం చేశారు. నిశ్చలంగా నాతిహ్రస్వం, నాతిదీర్ఘంగా ఉన్న స్వామిశరీరం, వారి కాషాయవస్త్రములూ, బ్రంటను చూచారు. స్వామివయస్సు అపుడు దాదాపు నలభై. స్వామివారి ముఖవర్చస్సుకు బ్రంటన్‌ ముగ్థులైపోయారు. వారికళ్ళలోని ప్రశాంతిని గుర్తించారు. బ్రంటన్‌ ఆంగ్లంలో మాట్లాడగా, వెంకటరమణి స్వామివారి జవాబులను అనువదించి బ్రంటన్‌కు తెలియచేశారు.

వెంకటరమణికి స్వామి త్రికాలజ్ఞానసంపన్నులని చాల నమ్మకం. అందుచేత బ్రంటన్‌ ప్రపంచ భవిష్యత్తునుగూర్చి స్వామిని ప్రశ్నించదలచి.

ప్రపంచంలోని రాచకీయ ఆర్థిక పరిస్థితులు ఎప్పుడు మళ్ళా కుదుట బడుతాయని మీరు అనుకొంటున్నారు?' అని అడిగారు. ''ప్రపంచంలో మార్పు అంతసులభంగారాదు. దానికి కొంతవ్యవధి అవసరం. దేశాలు మారణాయధముల కోసం ప్రతిసంవత్సరం కోట్లకొలది ఖర్చుపెట్టుతున్నప్పుడు కాలంలో అభివృద్ధి ఎలాసాధ్యం?''

'కానీ నిరాయుధీకరణగూర్చిన మాటలుకూడ ఈ రోజుల్లో వినవస్తున్నవి. వాని ప్రభావం ప్రపంచపరిస్థితులపై ఉంటుందికదా?'

యుద్ధనౌకలు భగ్నంచేసినా. మారణాయుధాలు తుప్పుపట్టినా ప్రజలు ఆయుధాలు లేవుకదా అని ఊరుకోరు. కఱ్ఱలసాయంతో నైనా యుద్ధం చేస్తాడు. మారవలసినది మనస్తత్వం. ఆయుధ పరికరాలు కాదు. దేశాలమధ్య జాతుల మధ్య పరస్పర సౌహార్దం నెలకొల్పాలి. ఆధ్యాత్మిక దృక్పథంతో దేశాలమధ్యనూ దేశంలోకూడా సమత్వం సాధించాలి. అటువంటి పరిస్థితులు ఏర్పడితేకానీ, శాంతిసౌభాగ్యాలు రావు''.

'ఆస్థితి చాలదవ్వులో ఉన్నట్లు కనిసిస్తుంది. మరి వేరే విమోచన ఏదీలేదా?

''భగవంతుడు ఒకడు ఉన్నాడు కదా!''

'భగవంతుడే వుంటే ఆయన చాలదూరంలోఉన్నట్లున్నది.'

''భగవంతునికి మానవాళిపై ప్రేమ ఎన్నడూవుంటుంది.''

''ఈ విపత్కర పరిస్థితులను చూస్తే, భగవంతుని ప్రేమకు బదులు ఆయన నిరాదరణ నాకు కనిసిస్తోంది.'' అని బ్రంటన్‌ అసహనంగా అన్నారు. తర్వాత తన తొందర పాటుకు నొచ్చుకొన్నారు. స్వామి వింతగాచూస్తూ?

''సహనశీలి దృష్టి ఎప్పుడూ గంభీరంగావుంటుంది. మానవులను నిమిత్తమాత్రంగా చేసుకొని భగవంతుడు సకాలంలో తన కార్యాలను చక్కదిద్దుతూ వుంటాడు. దేశాల మధ్య ఉన్నసంక్షోభం. ప్రజలలోని నైతిక పతనం, కోట్లాది, జనుల ఆర్తనాదం - అన్నీ కలసి, ఒక మహాత్ముని రాకకు కారణం ఔతుంది. ప్రతి శతాబ్దంలోనూ, ఎవరో ఒకరు మహానుభావులు పుట్టుతూనే ఉంటారు. ఆధ్యాత్మిక పతనం ఎంతెంత గొప్పగా వుంటుందో, అంత గొప్ప మహాత్ముడు దానిని ప్రతిఘటించడానికి జన్మిస్తూ ఉంటాడు.''

'ఐతే మనకాలంలో కూడా అలాంటి మహాత్ముడు ఉదయిస్తాడంటారా?'

'ఆ మనం ఉన్న శతాబ్దంలో ఇప్పుడున్న చీకటిని తొలగించడానికి ఒక కారణజన్ముడి అవసరం ఎంతైనా ఉన్నది. ''అంటే మీ అభిప్రాయంలో, మనుష్యుడు అత్యంత పతనావస్థకు వచ్చినా డనియా?'

'లేదు. నేను ఆ విధంగా అనుకోవటంలేదు. ప్రతి జీవిలోనూ, ఆత్మపదార్థం ఒకటి ఉన్నది. అది కట్టకడపట జీవిని భగవంతుని వద్దకు తిరిగి తీసుకొని వస్తుంది.''

'మా పాశ్చాత్య దేశాలలో మనుష్యులను చూస్తే, వాళ్ళ హృదయ సీమలలో భగవంతుడు కాదు క్రూరపిశాచంఉన్నట్లు అనిపిస్తుంది.'

'మనం మనుష్యులను దూషించి ప్రయోజనం లేదు. వాళ్ళ పరిసరాలను వాతావరణమూ అర్థం చేసుకోవాలి. ప్రజలు పరిసరాలకు లోబడి వ్వక్తిగతంగా ఉన్న మంచిని మరచిపోయి దుర్మార్గంలో పడిపోతున్నారు. ఈ విషయం ప్రాచ్యప్రతీచీ దేశాలకు రెంటికి అనువర్తిస్తుంది. సమాజానికి మనం ఒక ఉన్నతమైన లక్ష్యాని గుర్తుకు తేవాలి. ఆర్థిక సంపద ఒక్కటే చాలదు. దానికి తోడుగా ఆధ్యాత్మిక సంపదా ఉండాలి. ఈ రెంటి సమన్వయం సాధిస్తే కాని లోకానికి ముక్తిలేదు. కాలు జారినపుడంతా మళ్ళా మనం లేచి తిరుగుతున్నాం. అదేవిధంగా ఈ పతితావస్థకూడా అదృశ్యమై ఒక ఉన్నతస్థితి రావడానికి అస్పదం ఉన్నది.'

'అంటే మీరు లోకవ్యవహారంలోకూడ ఆధ్యాత్మిక. సూక్తులను వ్రేశ##పెట్టాలని అంటారా?'

'ఔను. అది ఆచరణీయమే. లోకవ్యవహారంలో ధర్మనిష్ట ఏర్పిడితే అది బహుజనహితంగానూ, బహుజనసుఖంగానూ ఉంటుంది. భారతదేశంలో రాజకీయాలలో కూడ మహాత్ముల సలహాలను తీసుకొనే ఆచారం వున్నది. ప్రపంచంలో అన్ని దేశాలవారూ ఈ ఆచారాన్ని పాటించగలిగితే శాంతి సౌఖ్యములకు కొదవ ఉండదు.'

''మీరు ఈ పీఠానికి వచ్చి ఎన్నేళ్ళనది?''

''నేను ఈ పీఠానికి 1907లో వచ్చాను. అప్పుడు నాకు పండ్రెండేళ్ళు. తర్వాత నాలుగేళ్ళ ధ్యానంలోనూ విద్యాభ్యాసంలోనూ కావేరీతీరంలో ఒక గ్రామంలో గడిపాను. అటుతర్వాతనే, మఠనిర్వహణ కార్యంలో నేను ప్రవేశించాను. 1918లో నేపాలు మహారాజావారు తమ దేశానికి రమ్మని ఆహ్వానించారు. తర్వాత ఉత్తరదిశగా మేము ప్రయాణంచేశాము. కాలినడకన రోజూ ఎక్కువ దూరంపోవటానికి వీలులేదు. ఈ ప్రయాణం కొన్ని సంవత్సరాల కాలం పట్టింది. దారిలో ఒక్కొక్క గ్రామంలోనూ విడిదిచేయాలి. ఎవరన్నా ఆహ్వానిస్తే వారికోరిక త్రోసివేయడానికిలేదు. స్థానిక ఆలయంలో ప్రవచనం చేయవలసి వస్తుంది ప్రజలకోరిక పై.

''నేను నిజమైన యోగిని దర్శించాలని ఉత్సాహపడుతున్నాను. నేను చూచిన వారంతా మాట్తాడేవారే. వారి యోగసిద్ధి ప్రత్యక్షముగా కనబడటం లేదు. ఈనా కోరిక ఏమన్నా విపరీతమా?''

స్వాములవారు ప్రశాంతంగా బ్రంటన్‌వైపు చూచి, తమ చిబుకమును వ్రేళ్ళలో తడువుతూ ఇలా అన్నారు.

''నిజమైన యోగంలో ప్రవేశం మీరు వాంచిస్తున్నారంటే అదేమీ విపరీతమైన కోరికకాదు. మీ భావశుద్ధే మీకు సహాయకారి ఔతుంది. మీ వాంచితార్థాన్ని నేను చూడగలుగుతున్నాను. మీలో ఒక జ్యోతి వెలగడానికి ప్రారంభించింది. ఆ జ్యోతియే మీరు కోరిన చోటుకు మిమ్ములను తీసుక వెళ్ళగలదు.''

'అయితే మీరు ఈ విషయంగా ఏమి సలహాఇస్తారు?

''మీ యాత్రలన్నీ పూర్తిచేయండి. మీ యాత్రలలో చూచిన మహాత్ములలో మీకు నచ్చినవారిని ఎన్నుకోండి. ఆయనవద్దకు వెళ్ళితే, ఆయన మీకు తప్పక ఉపదేశం చేస్తాడు.''

'ఒకవేళ నాకు ఎవరూ నచ్చకపోతే. అప్పుడు ఏమి చేయమంటారు?'' 'అపుడు ఐకాంతిక భక్తిని చేయాలి. దేవుడే కావలసిన ఉపదేశమిస్తాడు. క్రమంగా ధ్యానం అలవాటుచేసుకోండి. ఉత్తమవిషయాలను, అనురాగంతో భావనచేయండి. తరచు ఆత్మవిషయమై చింతనచేయండి. ఈ ఆత్మచింతన, ఆత్మను దాపులోనికి తెస్తుంది. ఉదయం లేవగానే ధ్యానంచేయటం మంచిది. తర్వాత సాయంసమయం అనుకూలమైనకాలం. అపుడు లోకం ప్రశాంతిగా వుంటుంది. ధ్యాననిదోథములైన విషయములు ఆ కాలంలో తక్కువ.'

''ఒకవేళ నేను నా ప్రయత్నంలో విఫలమొందితే మీవద్దకు సహాయానికి రావచ్చునా?''

ఈ మాటకు స్వాములవారు తల అడ్డంగా ఆడించారు.

''నేను మఠాధిపతిని. నాకు విరామంఅంటూ వుండదు. నాకున్న కాలమంతా మఠనిర్వహణలోనే సరిపోతుంది. కొన్ని సంవత్సరాలు నేను మూడుగంటలకు పైగా నిద్రపోయినది లేదు అలాంటపుడు నేను ప్రత్యేకంగా శిష్యులను ఏలా స్వీకరించగలను? మీకు తనకాలాన్ని ఇవ్వగల మహాత్ముణ్ణి మీరు వెదకాలి.''

''నిజమైన మహాత్ములు అరుదు అని అంటారు. అందులోనూ నాలాంటి పాశ్చాత్యునికి అతడు సుదుర్లభుదు.''

స్వాములవారు తలఊపి,

''సత్యమెప్పుడూ ఉన్నదే. దానిని తెలుసుకోనూ వచ్చు''

''మీరు అలాంటి ఒక సిద్ధపురుషుని వద్దకు నన్ను పంపలేరా?''

స్వాములవారు కొంతసేపు మౌనముద్ర వహించారు. కొంతసేపయిన పిదప ఇలా అన్నారు;

''నాకు తెలిసిన మహాత్ములు ఇద్దరు వున్నారు. ఒకరు కాశీలో ఉన్నారు. వారిని దర్శించటం కష్టం. ఇంతవరకూ ఏ పాశ్చాత్యుడూ వారిని చూచినది లేదు. వారివద్దకు మిమ్ములను పంపితే వారు మిమ్ములను అంగీకరించకపోవచ్చును.''

''మరి రెండోవారో?''

''ఆయన దక్షిణదేశంలో ఉన్నారు. వారివద్దకు మీరు వెళ్ళవచ్చును. ఆయనను మహరి అని అంటారు. వారు అరుణాచలంలో ఉన్నారు. మీరు దక్షిణవదలిపోయేదానికి ముందు వానిని తప్పక దర్శించండి. మీ అభీష్టం నెరవేరుతుంది. అదుర్దా పడనవసరంలేదు. మీరు దేనిని అన్వేషిస్తున్నారో దానిని పొందగలుగుతారు.''

బ్రంటన్‌ స్వాములవారి వద్ద సెలువుతీసుకొని వెంకటరమణితో కలిసి మద్రాసుకు మరలినాడు. స్వాములవారిని కలిసిన పాశ్చాత్యులలో బ్రంటనే ప్రథముడు.

ఆరాత్రి బ్రంటన్‌ తనగదిలో విశ్రమించి, దాదాపు మూడుగంటలపుడు మేల్కొన్నారు. గదిలో చీకటి. తన పడక వద్ద కాళ్లున్న భాగంలో ఒక వెలుతురు ఉన్నట్టుంది. కనపడింది. వెంటనే లేచికూర్చున్నారు. కళ్ళునులుముకొని చూడగా - అతనికి ఆ వెలుతురులో స్వాములవారి మూర్తి గోచరించింది. చుట్టూ చీకటి. వెలుతురులో స్వామిమూర్తి. వారి మూర్తి అతనిదృష్టికి భౌతికంగానే కనబడింది. మీరు ఏలా వచ్చారు? మనము వారిని చెంల్సట్టులో వదలివచ్చాము కదా?' అని మళ్ళా కళ్ళుమూసుకొని కొంతసేపు ఉండి, ఇది భ్రమకాదుకదా అని కళ్ళు తెరచి చూచినారు. స్వామివారి మూర్తి యధా ప్రకారం ఆచోటనే వున్నది. మార్పేమీ లేదు. కాగాయములను దాల్చిన ఆమూర్తి నిబంగా కనబడింది. ఆయన పెదవులు కదిలినట్లూ, వారు ఓపిక పట్టు. నీవు కోరునది సిద్ధిస్తుంది. అని చెప్పక చెప్పినట్లూ అతనికి తోచింది.

తర్వాత ఆ మూర్తి ఉన్నట్టుండి అదృశ్యమైనది. ఆ తర్వాత అతనికి నిద్రపట్టలేదు. చెగల్పట్టులో శ్రీవారితో చేసిన సంభాషణను నెమరువేస్తూ శ్రీవారి మూర్తిని ధ్యానిస్తూ శేషరాత్రిని పాల్‌ బ్రంటన్‌ గడిపారు.


Jagathguru Bhodalu Vol-9        Chapters        Last Page